Rajya Sabha elections: ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ సీట్ల భర్తీ కోసం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు ఖాళీ కాగా, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉండగా, జూన్ 9న వాటి పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు కల్పించారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జూన్ 18న జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియ జూన్ 20 నాటికి పూర్తికానుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది.
దీంతో ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ స్థానాలకు అధికార కూటమి ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దింపుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.








