ట్రోఫీ గెలిచిన ఆనందంలో కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చాంపియన్‌గా నిలిచి అభిమానులకు డబుల్ ధమాకా అందించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీని సొంతం చేసుకున్న ఆర్సీబీ జట్టు విజయోత్సాహంలో మునిగిపోయింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో విరాట్, అనుష్క, జట్టు మెంటార్ దినేష్ కార్తీక్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఉత్సాహభరితంగా స్టెప్పులు వేస్తూ ఆనందాన్ని పంచుకున్న ఈ స్టార్ కపుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించిన అతడు 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఆర్సీబీ విజయాల్లో ఎప్పుడూ జట్టుకు మద్దతుగా నిలిచే అనుష్క శర్మ ఈసారి కూడా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించింది. గెలుపు ఖరారైన వెంటనే అనుష్క శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇప్పుడు ఈ జంట డ్యాన్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, జట్టుకు విజయాన్ని అందించే కీలక షాట్ కొట్టాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నానని, ఆ కల నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే యువ ఆటగాళ్ల నుంచి వస్తున్న పోటీ తన ఆటలో మరింత దూకుడు తీసుకొచ్చిందని చెప్పాడు.








