Crude oil prices: అమెరికా–ఇరాన్(America- Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు గురువారం ఒక్కసారిగా కోలుకోవడం మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
జూలై డెలివరీకి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2 శాతం పెరిగి 96.21 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.9 శాతం పెరిగి 90.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభంపై అమెరికా–ఇరాన్ మధ్య ఇంకా స్పష్టత రాకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఇరాన్‌లోని ఒక సైనిక స్థావరంపై అమెరికా వైమానిక దాడులు జరిగినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడులు రక్షణ చర్యల్లో భాగమేనని పేర్కొన్నారు. అలాగే వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్లను అమెరికా బలగాలు అడ్డుకున్నట్లు సమాచారం. మరో డ్రోన్ లాంచింగ్ యూనిట్‌పై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ వారం కూడా క్రూడ్ ధరలు తగ్గుదల దిశగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధ పరిస్థితులకు తాత్కాలిక పరిష్కారం లభించే అవకాశాలపై మార్కెట్లు ఆశాభావంతో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక ఇరాన్‌తో ముసాయిదా ఒప్పందం కుదిరిందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇరాన్‌పై ఆంక్షలు సడలించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు టెహ్రాన్ మాత్రం ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, దాడులు ఆపాలని డిమాండ్ చేస్తోంది.
రాబోబ్యాంక్ గ్లోబల్ ఎనర్జీ స్ట్రాటజిస్ట్ జో డిలౌరా ప్రకారం, చైనా మళ్లీ భారీగా చమురు దిగుమతులు ప్రారంభిస్తే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదరకపోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.








