NTR Ghat: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
సినీ రంగంలో అజరామరమైన గుర్తింపు పొందిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తారక్ తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఘాట్‌ను సందర్శించారు.
ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి చేతులు జోడించి కాసేపు మౌనం పాటించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పాల్గొని నివాళులు అర్పించారు.
నందమూరి హీరోలు వస్తున్నారనే సమాచారం తెలిసిన అభిమానులు తెల్లవారుజామునే భారీ సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ‘జోహార్ ఎన్టీఆర్’, ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఘాట్ పరిసరాలు మారుమోగాయి.








