PM Modi: ఐదు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధాని మోడీ గత రాత్రి జరిగిన కేంద్ర మంత్రి మంత్రిమండలితో కీలక సమావేశం(High-Level Cabinet Meeting) జరిగింది. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో తొమ్మిది కీలక మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను సమర్పించాయి.
వ్యవసాయం, అడవులు, కార్మిక, రోడ్డు రవాణా, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశాంగ, వాణిజ్యం, విద్యుత్ వంటి శాఖలు “వికసిత్ భారత్ 2047” లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై వివరమైన ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. కేబినెట్ సెక్రటరీతో పాటు నీతి ఆయోగ్ కూడా నివేదికలు సమర్పించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ “వికసిత్ భారత్ అనేది కేవలం నినాదం కాదు, ప్రభుత్వ కమిట్మెంట్” అని స్పష్టం చేశారు. పాలనలో ప్రజల సంక్షేమం, పౌరుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అనవసర ఆలస్యాలకు తావు లేకుండా సమర్థవంతమైన పాలన అందించాలని ప్రధాని ఆదేశించారు. అన్ని శాఖలు సంస్కరణలపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, రవాణా, ఏవియేషన్ వంటి రంగాలపై ఆ ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోడీ ఇటీవల చేసిన ఐదు దేశాల పర్యటన వివరాలను మంత్రివర్గానికి వివరించారు. ఈ పర్యటనలో సాధించిన ద్వైపాక్షిక ఫలితాలపై కూడా చర్చ జరిగింది.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఈ సమావేశంలో ప్రధానంగా పనితీరు సమీక్ష, పాలనా సంస్కరణలపై మాత్రమే చర్చ జరిగినట్లు సమాచారం.
అదే సమయంలో భారత్కు అవసరమైనంత ఇంధనం సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారత్ తమకు కీలక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఎనర్జీ, డిఫెన్స్, ట్రేడ్ రంగాల్లో సహకారం మరింత పెంపొందించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.








