దేశంలో వీధి కుక్కల సమస్యను ప్రజల భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. అలాగే గత ఉత్తర్వులను సవరించాలన్న విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది.
స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, ప్రజల ప్రాణ భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. వీధి కుక్కల సమస్యను కేవలం జంతు సంక్షేమ అంశంగా కాకుండా ప్రజల రక్షణ కోణంలో చూడాలని పేర్కొంది.
ఈ సందర్భంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) రూపొందించిన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తి స్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. జనాభా ఆధారంగా అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించింది.
దేశవ్యాప్తంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. జాతీయ రహదారులపై సంచరించే జంతువుల సమస్యపై ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశించింది.
మానవులకు ప్రమాదకరంగా మారే లేదా రేబిస్ సోకిన కుక్కల విషయంలో చట్టబద్ధ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలు చేసే అధికారులకు రక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వాలను ఆదేశించింది.
ALSO READ: Kamal Haasan | ‘కల్కి పార్ట్ 2’ కోసం ఎకానమీ క్లాస్…కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా








