ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న వేళ భారత్ భారీ వ్యూహాత్మక అడుగు వేస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా గొలుసులు దెబ్బతింటుండటంతో.. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం “కోల్ గ్యాసిఫికేషన్”పై భారీ ప్రణాళికను అమలు చేయబోతోంది. ఇందుకోసం కేంద్ర కేబినెట్ ఇప్పటికే రూ.37,500 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కోసం కాల్చేస్తారు. కానీ కోల్ గ్యాసిఫికేషన్‌లో బొగ్గును ప్రత్యేక సాంకేతిక ప్రక్రియ ద్వారా “సింగ్యాస్” అనే వాయువుగా మారుస్తారు. ఈ గ్యాస్‌తో:
- యూరియా ఎరువులు
- అమోనియా
- మిథనాల్
- పారిశ్రామిక రసాయనాలు
- శుభ్రమైన ఇంధనాలు తయారు చేయవచ్చు.
అంటే బొగ్గును కేవలం కాల్చేయకుండా.. అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడం ఈ టెక్నాలజీ లక్ష్యం.
భారత్ ఎందుకు ఈ ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తోంది?
భారత్ వద్ద దాదాపు 200 ఏళ్లకు సరిపడా అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, యూరియా, ఎల్‌ఎన్‌జీ గ్యాస్, అమోనియా వంటి కీలక ఇంధనాలు, రసాయనాల కోసం ఇప్పటికీ విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది.
- ఎల్‌ఎన్‌జీ గ్యాస్
- యూరియా
- అమోనియా
- ఇతర రసాయనాల కోసం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోంది.
2025 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే భారత్ ఈ దిగుమతుల కోసం రూ.2.77 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసింది. ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో హోర్ముజ్ జలసంధి సమస్యల కారణంగా యూరియా ధరలు భారీగా పెరగడంతో కేంద్రం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.
రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తాయి?
కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త విధానంతో:
- భారీ ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి వచ్చే అవకాశం ఉంది
- రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అంచనా
- 50 వేల మందికి ఉపాధి అవకాశాలు
- ప్రభుత్వానికి ఏటా రూ.6,300 కోట్ల అదనపు ఆదాయం. లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
చైనా మోడల్‌ను భారత్ అనుసరిస్తోందా?
అవును. చైనా ఇప్పటికే కోల్ గ్యాసిఫికేషన్‌లో ప్రపంచంలో ముందంజలో ఉంది. అక్కడ యూరియా అవసరాల్లో 78% బొగ్గు నుంచే తయారవుతోంది. అందుకే ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినా చైనా దేశీయంగా ధరలను నియంత్రించగలుగుతోంది. ఇప్పుడు భారత్ కూడా అదే తరహా వ్యూహంతో ముందుకెళ్తోంది.
భారత్‌కు ఉన్న ప్రధాన సవాలు ఏంటి?
భారత బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో సాధారణ గ్యాసిఫికేషన్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు:
ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు
భారతీయ ఇంజనీర్లు
ప్రత్యేక “ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫైయర్” టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని ద్వారా భారత బొగ్గును తక్కువ ఉష్ణోగ్రతలోనే సమర్థవంతంగా వాయువుగా మార్చవచ్చు.
ఈ ప్రాజెక్ట్ వల్ల భారత్‌కు లాభం ఏమిటి?
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే:
- విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది
- ఎరువుల ధరలపై నియంత్రణ సాధ్యమవుతుంది
- దేశీయ పరిశ్రమలకు చౌకైన ఇంధనం లభిస్తుంది
- ఇంధన భద్రత పెరుగుతుంది. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి బలమైన అడుగు అవుతుంది.
భవిష్యత్తులో ప్రపంచ ఇంధన సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.








