ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టిక్‌టాక్(Tik Tok) మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్(Zhang Yiming) సంపద భారీగా పెరగడంతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని ఆయన అధిగమించారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం, ఝాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ముకేష్ అంబానీ సంపద 86.9 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో ఆయన మూడో స్థానానికి చేరుకున్నారు. కాగా, 117 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.బైట్‌డ్యాన్స్ మార్కెట్ విలువ పెరగడం, కృత్రిమ మేధ రంగంలో సంస్థ చేపడుతున్న విస్తరణ ప్రణాళికలు ఝాంగ్ యిమింగ్ సంపద పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా సంస్థ రూపొందించిన ‘డౌబావో’ ఏఐ చాట్‌బాట్ చైనాలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. నెలవారీ వినియోగదారుల సంఖ్య 300 మిలియన్లను దాటినట్లు సమాచారం. 2012లో ప్రారంభమైన బైట్‌డ్యాన్స్ సంస్థ, డౌయిన్ మరియు అనంతరం టిక్‌టాక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధమవుతుండటంతో భవిష్యత్ వృద్ధిపై పెట్టుబడిదారుల్లో ఆశావాదం పెరిగింది.
ఈ ఏడాదిలోనే సుమారు 70 బిలియన్ డాలర్లను ఏఐ అభివృద్ధి కోసం వెచ్చించే ప్రణాళికలు సంస్థ వద్ద ఉన్నట్లు అంతర్జాతీయ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ: TSPSC | ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ విడుదల చేసిన 290 ఉద్యోగాలు








