కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. భువనగిరి నుంచి బడాపహడ్ వెళ్తున్న స్కార్పియో కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. ఈ దృశ్యం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా స్పందించి కారును రోడ్డు పక్కకు ఆపాడు.
అప్పటికి కారులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కారులో పొగలు రావడం గమనించిన వారు వెంటనే అప్రమత్తమై కారు వెలుపలికి పరుగులు తీశారు. గమనించిన వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాద సమయంలో అందరూ సమయస్ఫూర్తితో బయట పడిన కారణంగా పెనుప్రమాదం తప్పింది.
డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేవునిపల్లి ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రజలు ప్రయాణాల సమయంలో ఎలాంటి అపసవ్యం జరగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.