Yogi Adityanath: రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రతి వైఫల్యానికి కొత్త కారణాలు చెబుతున్నారంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తొలగించండి’ పాదయాత్రలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష కూటమిపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ రాజకీయ పరిస్థితిని వివరిస్తూ ఓ గ్రామీణ విద్యార్థి కథను ఉదాహరణగా చెప్పారు. పరీక్షల్లో వరుసగా విఫలమవుతున్న ఓ విద్యార్థి తన తప్పును అంగీకరించకుండా ప్రతిసారీ కొత్త సాకులు చెబుతుంటాడని వివరించారు. మొదటిసారి జవాబు పత్రం మార్చేశారని, మరోసారి సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇచ్చారని ఆరోపిస్తాడని చెప్పారు. ఇంకోసారి పెన్నులో సిరా అయిపోయిందని, ఆ తర్వాత ముందు కూర్చున్న విద్యార్థి వేగంగా రాయడంతో తన ఏకాగ్రత దెబ్బతిందని సాకులు చెబుతాడంటూ కథను ఆసక్తికరంగా వివరించారు. ఈ ఉదాహరణ ద్వారా రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిపై యోగి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎదురయ్యే పరాజయాలకు బాధ్యత తీసుకోకుండా ఇతర కారణాలను చూపించడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు చురకలంటించారు. మొత్తానికి, గాజియాబాద్ సభ వేదికగా యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలకు మరింత పదును పెట్టాయి. రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.
