మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలానికి చెందిన రంజిత్ (21) ప్రైవేట్‌గా విద్యుత్తు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8న గ్రామంలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్క్రూడ్రైవర్ అతని కుడి కంటి పైభాగంలో బలంగా దిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, అతని కుటుంబ సభ్యులు రంజిత్‌ను తక్షణమే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచనలతో ముందుగా నిమ్స్‌కు, ఆపై గాంధీ ఆసుపత్రికి ఈ నెల 10న రంజిత్‌ను తరలించారు. గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో స్క్రూడ్రైవర్ కంటి లోపలికి గుచ్చుకోలేదని, కేవలం పైభాగానికే గాయం అయినట్టు నిర్ధారణ అయింది. కంటి లోపలి భాగానికి ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలియజేశారు.
తర్వాత న్యూరోసర్జరీ విభాగంలోని వైద్యులు రెండు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి స్క్రూడ్రైవర్‌ను జాగ్రత్తగా తొలగించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం రంజిత్ ఆరోగ్యంగా కోలుకుంటున్నాడని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి వెల్లడించారు.
చూపు మీద ఎలాంటి ప్రభావం పడలేదని వైద్యులు స్పష్టంగా తెలిపారు. ఈ ఘటనలో రంజిత్ అద్భుతంగా ప్రమాదం నుంచి బయటపడినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్క్రూడ్రైవర్ కంటికి దెబ్బతీయకుండా ఉండటం నిజంగా అద్భుతమేనని వారు పేర్కొన్నారు.