ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టిని తరలించడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. సుమారు 40 ట్రాక్టర్లు రోజూ మట్టిని తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.
తనేలు సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువును తవ్వి, అక్కడి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో రోడ్లపై బురద కట్టడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి హానీ కలుగుతోందని, దీనిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
సంబంధిత శాఖలు ఈ సమస్యపై వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరారు. చెరువు తవ్వకాలను ఆపకుంటే, మట్టి తరలింపును కొనసాగిస్తే, పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు, స్థానికులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తక్షణమే అధికారులు రంగప్రవేశం చేసి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. లేకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని, సమీప రహదారులను సైతం దిగ్బంధించేందుకు వెనుకాడబోమని గ్రామస్థులు స్పష్టం చేశారు.