ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, పట్టణ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, చెత్తను మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రానగర్ హరిజనవాడలో మున్సిపల్ అధికారులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం మంత్రి మున్సిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో కొత్తపేట రైల్వే బ్రిడ్జి వద్ద స్వచ్ఛ ఆంధ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను వివరించి, కాగితపు బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించారు.
ధర్మవరం పట్టణాన్ని సుందరంగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. చెత్తను తొలగిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, పరిశుభ్రత పాటిస్తే భవిష్యత్తు తరం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ప్రతి శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ఆనంతరం మంత్రి సత్యకుమార్ పట్టణ వీధుల్లో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, ఎన్డీఏ నేతలు, మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు.