Ather Energy: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వేగంగా విస్తరిస్తున్న అథర్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. భవిష్యత్ వ్యాపార విస్తరణ ప్రణాళికలకు అవసరమైన మూలధనాన్ని సమీకరించే అంశంపై చర్చించేందుకు కంపెనీ జూలై 15న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్తగా నిధులను సమీకరించే ప్రతిపాదనపై డైరెక్టర్ల బోర్డు చర్చించనుంది. ఈక్విటీ షేర్లు, ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్లు (FCCBs), అలాగే ఈక్విటీగా మారే అవకాశం ఉన్న ఇతర సెక్యూరిటీల ద్వారా పెట్టుబడులు పొందే మార్గాలను పరిశీలించనున్నారు.
నియంత్రణ సంస్థలు, వాటాదారుల అనుమతులు పూర్తయిన తర్వాత నిధుల సమీకరణ ప్రక్రియను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో చేపట్టే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ సహా చట్టబద్ధంగా అనుమతించే పద్ధతుల ద్వారా మూలధనం సమీకరించే అవకాశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల అథర్ ఎనర్జీ షేర్లకు మార్కెట్లో మంచి స్పందన లభించింది. 2025 మేలో జరిగిన ఐపీఓ తర్వాత కంపెనీ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్, కంపెనీ విస్తరణ వ్యూహాలు ఈ వృద్ధికి కారణాలుగా నిలిచాయి.
వ్యాపార విస్తరణలో భాగంగా అథర్ తన రిటైల్ నెట్‌వర్క్‌ను భారీగా పెంచింది. సర్వీస్ సెంటర్ల సంఖ్యను కూడా విస్తరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది.తాజాగా సమీకరించనున్న నిధులను కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెట్ విస్తరణ, మౌలిక సదుపాయాల బలోపేతం కోసం వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. పెరుగుతున్న ఈవీ పోటీలో తన స్థానాన్ని మరింత బలపరచుకోవడమే అథర్ ఎనర్జీ లక్ష్యంగా కనిపిస్తోంది.








