గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.
గతంలో కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా, అది నేటితో ముగియడంతో పోలీసులు వంశీని మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో వంశీకి మరికొన్ని రోజులు జైల్లో ఉండాల్సిందేనని స్పష్టమైంది.
ఇక మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో రెండు కేసుల్లోనూ వంశీపై విచారణ కొనసాగనుంది.
ప్రస్తుతం వంశీ అరెస్ట్ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వర్గాలు వంశీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, వైసీపీ వర్గాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. వంశీపై తదుపరి విచారణలో ఏమి జరుగుతుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.