LIVE
Friday, November 6, 2026
LIVE
LIVE

Uttarakhand Helicopter Crash | ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు

by Bajaswamy
12 views
Helicopter crash near Joshimath in Uttarakhand

Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం మరోసారి కలకలం రేపింది. చమోలీ జిల్లాలో జోషిమఠ్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఆరుగురి ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆరుగురితో వెళ్తుండగా ప్రమాదం

ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలట్ సహా మొత్తం ఆరుగురు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రకాంత్, రాజశ్రీ, దినేష్, ఆకాష్, అథర్వతో పాటు పైలట్ హిమాంశుగా ప్రయాణికులను గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం. అయితే వీరి ప్రస్తుత పరిస్థితిపై అధికారిక స్పష్టత లేదు.

ప్రతికూల వాతావరణంతో గాలింపునకు ఆటంకం

banner

జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనుక చాయీ గ్రామ పరిసరాల్లో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం, దట్టమైన మేఘాలు, తక్కువ దృశ్యమానత కారణంగా హెలికాప్టర్ శకలాలను గుర్తించడం కష్టంగా మారింది. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం మరో రెండు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం.

సీఎం ధామి స్పందన

హెలికాప్టర్ ప్రమాదాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. అందులో ప్రయాణించిన వారు క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల చార్‌ధామ్ యాత్ర మార్గంలో ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ల అత్యవసర ల్యాండింగ్ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజా ప్రమాదంతో పర్వత ప్రాంతాల్లో విమాన ప్రయాణాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాలింపు చర్యలు పూర్తయిన తర్వాతే ప్రయాణికుల పరిస్థితి, ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More