Bollywood: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని, ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేస్తూ అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించారు. ఇటీవల అర్జెంటీనా-స్పెయిన్ ఫిఫా మ్యాచ్ సందర్భంగా ఛాంపియన్ జట్టు ఓటమి తర్వాత మళ్లీ పుంజుకోవడం ఎంత కష్టమో వివరించే క్రమంలో ఐసీయూ, సర్జరీ వంటి పదాలను ఉదాహరణగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.
అయితే ఆ వ్యాఖ్యలను చాలామంది తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినవిగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు ప్రచారం చేశారని చెప్పారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేసిన అమితాబ్, ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు. త్వరలోనే ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించడంతో అభిమానుల సందేహాలు తొలగిపోయాయి. అమితాబ్ స్వయంగా ఇచ్చిన వివరణతో ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న అన్ని ప్రచారాలకు ముగింపు పడింది.
ALSO READ: David Warner | మత్తులో డ్రైవింగ్ చేసిన వార్నర్.. కోర్టు తీర్పుపై అందరి చూపు!








