Britain AI Minister: కొత్త కేబినెట్‌ను ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం, భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించింది. కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ తన కేబినెట్‌లో కనిష్క నారాయణ్, లీసా నాండీకి కీలక శాఖలను అప్పగించారు. వీరిలో కనిష్క నారాయణ్‌కు దేశ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ (AI) శాఖ బాధ్యతలు అప్పగించడం విశేషం. ఇప్పటి వరకు ఆన్‌లైన్ భద్రత, డిజిటల్ విధానాలపై పనిచేసిన ఆయన ఇకపై దేశంలోని ఏఐ విధానాల రూపకల్పన, అమలును పర్యవేక్షించనున్నారు.
బిహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, ఆర్థికశాస్త్రంలో చదివిన ఆయన, అనంతరం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2024లో తొలిసారి ఎంపీగా ఎన్నికై, ఏడాదిలోనే మంత్రి పదవిని చేపట్టి ఇప్పుడు ఏఐ మంత్రిగా పదోన్నతి పొందారు.
మరోవైపు, భారతీయ మూలాలున్న సీనియర్ ఎంపీ లీసా నాండీకి మరోసారి సాంస్కృతిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాంచెస్టర్‌లో జన్మించిన ఆమె తండ్రి దీపక్ నాండీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. 2010 నుంచి విగాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లీసా, గత ప్రభుత్వంలోనూ ఇదే శాఖను నిర్వహించారు. కొత్త కేబినెట్‌లోనూ ఆమెపై విశ్వాసం ఉంచుతూ అదే బాధ్యతలను కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ALSO READ: IMD Forecasting | మరో 5 రోజులు వానలే.. ఇస్రో-ఐఎండీ తాజా హెచ్చరిక








