Maoists Surrender: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ ఉప కమాండర్ కేశాలు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ చర్యలు తీవ్రతరం కావడంతో అక్కడి మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందినవారు కాగా, మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారేనని చెప్పారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస పథకం కింద రూ.1.93 కోట్లు అందజేస్తోంది. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి ఆరోగ్య కార్డులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన 11 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఇద్దరే మిగిలినట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు.








