Stock market: దేశీయ షేర్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన బలమైన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలాన్ని అందించాయి. దీంతో సెన్సెక్స్ 918 పాయింట్లు ఎగబాకి 77,550 స్థాయిలో ముగిసింది. నిఫ్టీ కూడా 275 పాయింట్లు పెరిగి 24,050 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,121 వద్ద ఓపెన్ కాగా, మధ్యలో 77,622 గరిష్ట స్థాయిని తాకింది. రోజంతా కొనుగోళ్లు కొనసాగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు కనిపించడం మార్కెట్‌కు ప్రధాన ఊతంగా మారింది.
నిఫ్టీ సూచీలో ఆసియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి కూడా దేశీయ మార్కెట్లకు అనుకూలంగా మారింది. దక్షిణ కొరియా, జపాన్ వంటి ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 92.73గా నమోదైంది.
రూపాయి కొంత బలపడటం, బ్యాంకింగ్ రంగం బలపడటం వల్ల మార్కెట్లు గట్టిగా పుంజుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.








