TDP Mahanadu: టీడీపీ మహానాడులో ఈసారి భారీ స్థాయిలో ఆర్థిక విరాళాలు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తూ పార్టీకి తమ మద్దతు తెలిపారు. దీంతో మహానాడు వేదికపై విరాళాల జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం రూ.25.61 కోట్ల విరాళాలు సమీకరించామని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మహానాడు వేదికపై విరాళాలు అందించిన ప్రతి ఒక్కరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. మొదటి రోజు రూ.12.44 కోట్లు, రెండో రోజు రూ.13.17 కోట్ల మేర విరాళాలు అందాయని ఆయన వెల్లడించారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిసి అత్యధికంగా రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. పార్టీ కోసం కొందరు సోషల్ మీడియాలో, మరికొందరు క్షేత్రస్థాయిలో, ఇంకొందరు ఆర్థికంగా సహకరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కాలం నుంచే మహానాడులో విరాళాలు సేకరించే సంప్రదాయం కొనసాగుతోందని గుర్తుచేశారు. రెండో రోజు అందిన ప్రధాన విరాళాల్లో ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా తరఫున రాజగోపాల్ రూ.1.50 కోట్లు అందించారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు, నారాయణ విద్యాసంస్థలు తలో రూ.1 కోటి చొప్పున విరాళాలు ఇచ్చాయి. తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ రూ.50 లక్షలు అందించగా, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రూ.2 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు విరాళాలు ప్రకటించారు.








