బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నంతవరకు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉండేవి. అయితే, ఆమె ప్రభుత్వం ముగిసిన తర్వాత, బంగ్లా తాజా ప్రభుత్వం భారత్‌కు దూరంగా, చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరగా వెళ్తోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక వైఖరితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా యూనస్ బీజింగ్‌లో అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం ఆయన హైనాన్ ప్రావిన్స్‌లో జరిగిన బోవో ఫోరమ్ ఫర్ ఆసియా సదస్సుకు హాజరయ్యారు. అనంతరం బీజింగ్ చేరుకుని చైనా ప్రభుత్వ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు.
ఈ సమావేశాల్లో బంగ్లాదేశ్‌కు చైనా ఇస్తున్న రుణాలపై చర్చలు జరిగాయని, వడ్డీలు తగ్గించాల్సిందిగా యూనస్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు, చైనా పెట్టుబడులు పెంచేందుకు, కొన్ని ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజును మాఫీ చేయాలని ఆయన కోరారు.
ఈ పరిణామాలు భారత్-బంగ్లా సంబంధాలకు ప్రభావం చూపే అవకాశం ఉందని, బహిరంగ వర్గాలు భావిస్తున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ వైఖరి ఏమిటనేది త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.