Dubai Road Accident: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ కార్మికుల ప్రాణాలను బలితీసుకున్న దుబాయ్ బస్సు ప్రమాదం అందరినీ కలచివేసింది. కార్మికులతో ప్రయాణిస్తున్న మినీబస్సు ప్రమాదానికి గురికావడంతో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక భారీ ట్రక్కు రహదారి మధ్యలో నిలిచిపోయింది. అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న మినీబస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని సకాలంలో గుర్తించలేకపోయాడు. సురక్షిత దూరం లేకపోవడంతో బస్సు వేగంగా ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ట్రక్కును ఢీకొన్న వేగానికి బస్సు ముందువైపు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మృ**తి చెందగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విషాద ఘటనపై భారతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, మృతుల పూర్తి వివరాల కోసం వారి కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.








