Ranveer Singh Apology: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు సంబంధించిన ‘కాంతార’(Kantara) అనుకరణ వివాదం కర్ణాటక హైకోర్టులో కీలక మలుపు తీసుకుంది. గత ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రణవీర్ సింగ్, రిషబ్ శెట్టి పోషించిన దైవ పాత్రను అనుకరిస్తూ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది.
ముఖ్యంగా ఆ దైవాన్ని “ఫీమేల్ ఘోస్ట్”గా పేర్కొనడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై ఫిర్యాదు నమోదై, కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన విచారణలో రణవీర్ తరఫు న్యాయవాది అఫిడవిట్ సమర్పిస్తూ, తన వ్యాఖ్యలపై ఆయన చింతిస్తున్నారని తెలిపారు. సంబంధిత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.
అయితే ఈ క్షమాపణ సరైనది కాదని, స్పష్టత లేకపోయిందని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన రణవీర్ తరఫు న్యాయవాది, అవసరమైతే క్షమాపణ పత్రాన్ని సవరించేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని తనకు తెలియదని, ఇప్పటికే సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పానని వెల్లడించారు.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న, సవరించిన అఫిడవిట్‌ను సమర్పించాలని రణవీర్ సింగ్‌కు ఆదేశించారు.
కేసు విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. అప్పటిలోగా స్పష్టమైన క్షమాపణ పత్రాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.








