Chiranjeevi: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి స్పందనను సొంతం చేసుకోవడంతో సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన చిరంజీవి, ‘లెనిన్’ చిత్రానికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఆనందాన్ని కలిగించిందన్నారు. అఖిల్‌ను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తానని, ప్రతి సినిమాతో నటుడిగా అతడు మరింత మెరుగైన స్థాయికి చేరుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలు, నాగార్జునతో పాటు మొత్తం యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు.
మెగాస్టార్ సందేశానికి అఖిల్ కూడా వెంటనే స్పందించారు. “పెదనాన్నా.. మీ ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ నా వెన్నంటే నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ‘ఎక్స్’ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు థియేటర్లలో ‘లెనిన్’ను వీక్షించి ఆదరించాలని కోరారు.
మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి వీకెండ్‌కే డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడులు తిరిగి వచ్చే స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అఖిల్ సినీ ప్రయాణంలో ఈ చిత్రం అత్యంత విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








