TG SSC Results: టెన్త్ తరగతి విద్యార్థుల నిరీక్షణకు త్వరలోనే ముగింపు పలకనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 16తో పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈసారి ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ ప్రారంభం నుంచే సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు.
ప్రస్తుతం ప్రధాన భాషలు, గణితం వంటి సబ్జెక్టుల పేపర్ల వాల్యూయేషన్ కొనసాగుతోంది. సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్లను రెండో విడతలో మూల్యాంకనం చేయనున్నారు.
ఈ నెల 23లోగా మొత్తం మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, వెంటనే మార్కుల నమోదు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు విడుదల కాగా, ఈసారి షెడ్యూల్ మార్పుల కారణంగా మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్‌లో ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్మిషన్లను దృష్టిలో ఉంచుకుని ఫలితాలను త్వరగా ప్రకటించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.








