South Indian Cinema: స్టార్ కాంబినేషన్లు తెరపైకి వస్తే అభిమానుల్లో ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న ‘ధర్మన్’(Dharman) కూడా అలాంటి అంచనాలనే రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నయనతార(Nayanthara) భాగమయ్యారనే ప్రకటనతో చిత్రంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
రజనీ–నయన్ జోడీకి మరో అవకాశం
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సమర్పిస్తోంది. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రజనీకాంత్ వైవిధ్యమైన డాక్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. చేతిలో రక్తపు మరకలతో ఉన్న శస్త్రచికిత్స పరికరంతో కనిపించిన ఆయన లుక్‌కు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్ జత కావడం సినిమాపై ఉత్కంఠను పెంచింది. తాజా పోస్టర్‌లో రజనీకాంత్, నయనతార పెద్ద కిటికీ ముందు ఎదురెదురుగా నిలబడి కనిపించారు. బంగారు వర్ణపు వెలుతురు మధ్య వారి రూపాలను చూపించిన ఈ డిజైన్ ప్రత్యేకంగా నిలిచింది. అయితే సినిమాలో వీరిద్దరి పాత్రల స్వరూపం, కథలో వారి సంబంధం ఎలా ఉంటాయనే విషయాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
ఐదోసారి కలిసి నటిస్తున్న స్టార్స్
రజనీకాంత్, నయనతార గతంలో ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’తో మరోసారి జతకడుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సాంకేతికంగా కూడా ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖులు పనిచేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను అన్బరివ్ రూపొందిస్తున్నారు. రజనీకాంత్ విభిన్నమైన పాత్ర, నయనతార చేరిక, కమల్ హాసన్ నిర్మాణ భాగస్వామ్యం ‘ధర్మన్’కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. కథకు సంబంధించిన మరిన్ని వివరాలు, తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Neeraj Yadav | క్రీడాలోకంలో విషాదం.. దేశానికి పతకాలు తెచ్చిన పారా అథ్లెట్ కన్నుమూత
