Union Cabinet: దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భత్యాలకు నిధులు సమకూర్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ లక్ష్యాలతో కేంద్ర కేబినెట్ నాలుగు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటి కోసం మొత్తం రూ.29,267 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.
కంటైనర్ పరిశ్రమకు రూ.10 వేల కోట్లు
కంటైనర్ల తయారీ రంగంలో దేశాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. దేశంలోనే కంటైనర్ల ఉత్పత్తిని పెంచడంతో పాటు తయారీ రంగానికి మరింత ఊతమివ్వడం ద్వారా పరిశ్రమ విస్తరణకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
క్రీడా వస్తువుల తయారీకి ప్రోత్సాహం
దేశీయంగా క్రీడా పరికరాల తయారీకి మరింత ఊతమిచ్చేలా కేంద్రం కొత్త అడుగు వేసింది. స్పోర్ట్స్ గూడ్స్ తయారీ పరిశ్రమ విస్తరణ కోసం ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’ను ఆమోదించింది. ఈ పథకం అమలుకు రూ.1,856 కోట్ల నిధులను కేటాయిస్తూ, దేశంలో క్రీడా వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.
గ్రామాల అభివృద్ధికి రూ.7,395 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ‘ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’కు రూ.7,395 కోట్లు కేటాయించారు. ఈ నిధులు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడనున్నాయి.
డీఏ, డీఆర్ కోసం రూ.10,016 కోట్లు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్‌కు సంబంధించి రూ.10,016 కోట్లను కేంద్రం కేటాయించింది. అయితే, భత్యాలు ఎంత మేరకు పెరగనున్నాయనే శాతాన్ని మాత్రం ప్రకటించిన వివరాల్లో పేర్కొనలేదు. మొత్తంగా ఈ నాలుగు నిర్ణయాల ద్వారా పరిశ్రమల అభివృద్ధి, గ్రామీణ ప్రగతి, ఉద్యోగులు, పెన్షనర్ల భత్యాలకు సంబంధించిన అంశాలకు కేంద్రం నిధులు కేటాయించింది. ఈ నిర్ణయాల అమలుతో ఏ మేరకు ప్రయోజనాలు చేకూరుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
ALSO READ: Cyclone Arnab | వర్షాలు, ఈదురుగాలుల విధ్వంసం.. ఏడు కుటుంబాల్లో తీరని విషాదం
