LIVE
Thursday, October 29, 2026
LIVE
LIVE

Cyclone Arnab | ఆర్నబ్ తుఫాన్ బీభత్సం.. అమిత్ షాకు చంద్రబాబు కీలక లేఖ

by Bajaswamy
6 views
Andhra Pradesh CM Chandrababu Naidu

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధిత ప్రాంతాల పునరుద్ధరణకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టం పరిశీలన కోసం కేంద్ర బృందాలను త్వరగా రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు.

పంటలు, ఇళ్లు, రహదారులకు నష్టం

ప్రాథమిక వివరాల ప్రకారం తుఫాన్ ప్రభావంతో సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై 220కు పైగా చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని సీఎం వివరించారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు వేగంగా పనిచేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపైనా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. దాదాపు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

సహాయక చర్యల్లో యంత్రాంగం

banner

విపత్తును ఎదుర్కొనేందుకు 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు చర్యల ఫలితంగా ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయని, తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో పాటు బాధితులకు అవసరమైన సహాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. నష్టం వివరాలపై సమగ్ర పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్రానికి నివేదిక అందజేస్తామని సీఎం పేర్కొన్నారు. సహాయక చర్యలకు కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కోరుతూ, ఇప్పటికే అందిస్తున్న మద్దతుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బృందాల పరిశీలన, తదుపరి సాయంతో ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More