Cyclone Arnab: ఏపీలో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, బలమైన ఈదురుగాలులతో పలు జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రకృతి ప్రకోపానికి వేర్వేరు ప్రాంతాల్లో ప్రాణనష్టం సంభవించడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నంలోని పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఒకరు మరణించారు. సింహాచలం బాలాజీనగర్‌లో బిందు అనే వివాహిత ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పెనుగాలుల కారణంగా విషాదం చోటుచేసుకుంది. చర్చి దగ్గర చెట్టు విరిగి పడటంతో చొక్కా కిశోర్ (45) ప్రాణాలు కోల్పోయారు. బొండాడవారి వీధిలో విద్యుత్ స్తంభం పడిన ఘటనలో రాంబాబు (34) మరణించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర ప్రకాశ్‌పురంలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలులకు గుడిసె కూలిపోవడంతో కొల్లు వెంకాయమ్మ అనే మరో వృద్ధురాలు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుత్ షాక్‌కు గురై మరో మహిళ మరణించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు రాకపోకలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విరిగిపడిన చెట్లు, కూలిన స్తంభాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుపాను పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అధికారుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు.
