Property registration: తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించింది. వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, గృహ సముదాయాలు, వాణిజ్య భవనాలపై ఈ కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన ఈ విలువలు మే మొదటి వారం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ నిర్ణయంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరిగిన సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు.
మార్కెట్ విలువలు మరియు వాస్తవ మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను తగ్గించడమే ఈ చర్య లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఆస్తుల లావాదేవీలలో నల్లధనం వినియోగం తగ్గి పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ సవరణతో రిజిస్ట్రేషన్ల శాఖకు సుమారు రూ.2,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి పెంపు కాగా, చివరిసారిగా 2021లో విలువలు పెరిగాయి. స్థిరాస్తి రంగంలో మందగమనం కారణంగా గతంలో ఈ నిర్ణయం వాయిదా పడింది.








