Tamil Nadu Elections: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ ఉత్కంఠ రోజు రోజుకీ పెరుగుతోంది. భారీ పోలింగ్ నమోదు కావడంతో ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు ఎవరికి అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ఈసారి ఓటింగ్ శాతం రికార్డు స్థాయికి చేరడంతో సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారింది.
ఇదే సమయంలో తొలిసారి రాజకీయ రంగంలోకి దిగిన విజయ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువత, మహిళల భారీ ఓటింగ్ కారణంగా ఆయన ఫ్యాక్టర్ ఫలితాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే ప్రధాన కూటములు నియోజకవర్గాల వారీగా అంచనాలు వేసుకుంటుండగా, అవసరమైతే విజయ్ మద్దతు కీలకం కావచ్చని చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక పశ్చిమ బెంగాల్లో కూడా పోలింగ్ సరళి అంచనాలను తలకిందులు చేసింది. బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, సీఎం మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ పోలింగ్ కూడా అధిక శాతంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ట్రెండ్, ఓటర్ల స్పందన ఫలితాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్, మే 4న విడుదలయ్యే తుది ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.








