ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కుంభమేళా సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రాష్ట్రపతిని ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న రాష్ట్రపతి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆమె బడే హనుమాన్ ఆలయం, పవిత్ర అక్షయవట్ వృక్షాన్ని సందర్శించారు.
కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను రాష్ట్రపతి పరిశీలించారు. భక్తులతో కుంభమేళా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రపతి భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. దౌత్యవేత్తలు సైతం కుంభస్నానం ఆచరించారు. యూపీ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.








