Sonu Sood: ప్రముఖ నటుడు సోను సూద్ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకుపోయిన వారికి సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ ముందుండే సోనూసూద్, మరోసారి బాధితుల పక్షాన నిలవడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు, యునైటెడ్ స్టేట్స్ సంబంధిత పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉన్న పలువురు భారతీయులు, సినీ ప్రముఖులు మరియు ఇతర దేశాల ప్రజలు అక్కడే చిక్కుకుపోయారని సమాచారం. భద్రతా పరిస్థితుల కారణంగా చాలా మంది తమ దేశాలకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో సోనూసూద్ ముందుకు వచ్చి, దుబాయ్‌లో చిక్కుకున్న వారికి తాను సహాయం అందిస్తానని తెలిపారు. తమ తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఉచిత వసతి కల్పిస్తానని ప్రకటించారు. ఎలాంటి జాతీయతా పరిమితులు లేకుండా అందరికీ సహాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
సహాయం అవసరమైన వారు ఇంస్టాగ్రామ్ (Instagram) ద్వారా తనను సంప్రదించాలని సూచించారు.
“నో నేషనాలిటీ.. నో కండిషన్స్.. జస్ట్ హ్యూమానిటీ” అంటూ సోనూసూద్ చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కష్టకాలంలో ఆయన చూపిస్తున్న మానవత్వానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.








