PM Ujjwala Yojana: పీఎంయూవై కింద అందిస్తున్న గ్యాస్ సబ్సిడీ ప్రయోజనాల్లో కేంద్రం తాజా మార్పులు చేసింది. గతంలో ఏడాదిలో తొమ్మిది ఎల్పీజీ రీఫిల్స్‌పై అందుబాటులో ఉన్న రూ.300 సబ్సిడీని కేంద్రం తగ్గించి, ఇకపై నాలుగు రీఫిల్స్‌కు మాత్రమే వర్తింపజేయనుంది. సిలిండర్‌పై అందించే సబ్సిడీ మొత్తంలో ఎలాంటి మార్పు లేకపోయినా, రాయితీ పొందే సిలిండర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడం గమనార్హం.
ఈ మార్పు కారణంగా ఉజ్వల పథకం కింద ఉన్న కుటుంబాలకు ఏడాదికి అందే గరిష్ట ఆర్థిక సహాయం తగ్గనుంది. గతంలో ఎక్కువ సంఖ్యలో సబ్సిడీ సిలిండర్లు పొందిన లబ్ధిదారులు ఇప్పుడు పరిమిత ప్రయోజనంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 2016లో ప్రారంభమైన ఉజ్వల యోజనలో తొలుత ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ సదుపాయం ఉండేది. అనంతరం ఆ సంఖ్యను 9కి తగ్గించారు. తాజా నిర్ణయంతో అది నాలుగుకు పరిమితమైంది.
ఈ నిర్ణయానికి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్పీజీ దిగుమతి వ్యయం పెరిగినట్లు సమాచారం. మార్కెట్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలపై ఆర్థిక భారం అధికమవుతోంది.
సామాన్య వినియోగదారులకు తక్కువ ధరలో గ్యాస్ అందించడంతో పాటు ఉజ్వల లబ్ధిదారులకు అదనపు రాయితీ కల్పించడం వల్ల ప్రభుత్వంపై భారీ వ్యయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం నియంత్రించేందుకు సబ్సిడీ వర్తించే సిలిండర్ల సంఖ్యను తగ్గించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయం గ్రామీణ, పేద కుటుంబాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Nuclear Arsenal | రక్షణ రంగంలో దూసుకెళ్తున్న భారత్.. పాకిస్థాన్ కంటే 20 వార్హెడ్లు అధికం








