PM Modi convoy: ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పుడు ఆయన రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రయాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు కూడా పొదుపు పాటించాలని సూచించిన ప్రధాని మోడీ, ఆ సందేశాన్ని స్వయంగా అమలు చేస్తున్నారు.
సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్650 గార్డ్, రేంజ్ రోవర్‌లు, టయోటా ఫార్చ్యూనర్లు, జామర్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలతో కలిపి 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. అయితే తాజా నిర్ణయంతో కాన్వాయ్ పరిమాణాన్ని సుమారు 50 శాతం తగ్గించినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం పూర్తిగా కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ నిర్ణయం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇంధన పొదుపు దిశగా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నాయకులు ఇంధన పొదుపు దిశగా ముందుకు రావడం ఈ నిర్ణయానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.








