US Senator: అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేమని, ఆ దేశాన్ని అంతర్జాతీయ చర్చల్లో దూరంగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇరాన్‌కు పాకిస్థాన్ సైనికంగా సహకరించిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో లిండ్సే గ్రాహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ విమానాలకు పాక్ ఎయిర్‌బేస్‌లలో అనుమతి ఇచ్చినట్లు జరిగితే, అమెరికా వెంటనే ప్రత్యామ్నాయ మధ్యవర్తిని వెతకాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. “నేను పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేను. ఆ దేశాన్ని వీలైనంత దూరంగా ఉంచుతాను” అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా దాడుల భయంతో ఇరాన్ తన కొన్ని యుద్ధ విమానాలు మరియు నిఘా విమానాలను పాకిస్థాన్‌కు తరలించిందని వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. తమ ఎయిర్‌బేస్‌లలో ఇరాన్ సైనిక విమానాలకు ఆశ్రయం ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్థాన్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ, మధ్యవర్తిత్వం కోసం ఇతర దేశాలను వెతకాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో అమెరికా-ఇరాన్-పాకిస్థాన్ మధ్య డిప్లొమాటిక్ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.








