హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్(Parade Ground)లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, అక్కడ బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ప్రజలు అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి మార్పు తీసుకొచ్చారని చెప్పారు. అదే ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కుటుంబ పార్టీలుగా విమర్శించిన ఆయన, ప్రజలు ఇలాంటి రాజకీయాలను తిరస్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీపై నమ్మకం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ, గతంలో తెలంగాణలో ఉగ్రవాదం వల్ల భారీ నష్టం జరిగిందని, పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే పరిస్థితి త్వరగా అదుపులోకి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడున్నా ఒకే విధమైన పాలనా విధానం కనిపిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, తర్వాత వాటిని అమలు చేయకుండా సాకులు వెతకడం కాంగ్రెస్ అలవాటుగా మారిందని ఆరోపించారు.
తెలంగాణలో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోందని తెలిపారు.








