AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండో దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, నియామకాలకు సంబంధించిన వివిధ అంశాలపై సవివరంగా చర్చించారు.
సమావేశంలో ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ల జారీకి అవసరమైన ప్రక్రియ, ఈ-హెచ్ఆర్ఎం వ్యవస్థలో చేపట్టాల్సిన పనులు, స్థానిక కేడర్ విధానానికి అనుగుణంగా పోస్టుల విభజన వంటి అంశాలను అధికారులు సమీక్షించారు. అలాగే కొత్త స్థానిక కేడర్ల ప్రకారం పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాల ఖరారు, రోస్టర్ అమలు, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపే ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, బి. రాజశేఖర్, కృష్ణబాబు, జి. జయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖల నుంచి అవసరమైన వివరాలు త్వరగా సేకరించి రెండో దశ జాబ్ క్యాలెండర్‌ను ఖరారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
కాగా, ఈ ఏడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి 10,060 పోస్టుల భర్తీకి మార్గం సుగమం చేసింది. ఆ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రారంభమైందని ప్రకటించారు. ఇప్పుడు రెండో దశ జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశాలపై ఉద్యోగార్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి.
AP Job Calendar | ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండో దశ జాబ్ క్యాలెండర్..!
-








