PM Modi Convoy: ఇంధన ఆదా దిశగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు(fuel conservation)అవసరాన్ని గుర్తించి ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసిన ప్రధాని, ఇప్పుడు ఆచరణలో కూడా ముందుండే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ప్రధాని భద్రతా కాన్వాయ్‌లో వాహనాల(Security Convoy Vehicles) సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆయన ఎస్పీజీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యం వ్యక్తమవుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు కూడా ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చారు. అదే సందేశాన్ని ఆచరణలో చూపించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త మార్పుల ప్రకారం, కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. భద్రతా ప్రోటోకాల్స్‌లో ఎటువంటి మార్పు లేకుండా, SPG ఆధ్వర్యంలో ఈ మార్పులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులకు కూడా ఇంధన పొదుపు దిశగా ఒక బలమైన సందేశాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో కూడా గ్రీన్ ఎనర్జీ, ఫ్యూయల్ ఎఫిషియెన్సీకి ఇది కొత్త దిశ చూపుతుందని భావిస్తున్నారు.








