Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం, పార్లమెంట్ సమావేశాలు ఒకేసారి ప్రారంభం కావడం శుభపరిణామమని పేర్కొంటూ, ఈ సమావేశాలు దేశాభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఇటీవల దేశంలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను ప్రస్తావించిన ప్రధాని, భారత యువత సాధిస్తున్న విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు.
స్వదేశీ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్'(Skyroot) విజయం దేశానికి గర్వకారణమని, యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల ప్రతిభ భారత్ భవిష్యత్తుకు నిదర్శనమని కొనియాడారు. యువతలో ఆవిష్కరణల పట్ల పెరుగుతున్న ఆసక్తి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.
అలాగే రాజస్థాన్‌లో దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసిన మోడీ, సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ రైలు వంటి ప్రాజెక్టులు దేశ పారిశ్రామిక అభివృద్ధికి బలం చేకూరుస్తాయని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్ 7.7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ALSO READ: OpenAI లో తెలుగు యువకుడి హవా.. ఓపెన్ఏఐ సీటీఓగా ఉదయ్








