Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshPawan Kalyan | రైతులు భయపడొద్దు.. సూపర్ ఎల్ నినోపై పవన్ కల్యాణ్ భరోసా

Pawan Kalyan | రైతులు భయపడొద్దు.. సూపర్ ఎల్ నినోపై పవన్ కల్యాణ్ భరోసా

-

Chat on WhatsApp

Pawan Kalyan: రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమైన ఆయన, నీటి కొరత పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రైతులకు నేరుగా వివరించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి సూపర్ ఎల్‌నినో ప్రభావం, నీటి వినియోగంలో జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చేయించుకునేలా ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తొలగించడం, గట్లకు మరమ్మతులు చేయడం, లీకేజీలను నివారించడం ద్వారా నీటి వృథాను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నీటి నిర్వహణ చర్యలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతాల రైతుల అవసరాల దృష్ట్యా ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి పరిస్థితులను పరిశీలిస్తానని మంత్రి వెల్లడించారు.

సమావేశం అనంతరం భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp