ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ వైసీపీ ప్రభుత్వాన్ని వాలంటీర్ల విషయంలో తీవ్రంగా విమర్శించారు. డుంబ్రిగూడ మండలంలోని కురిది గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేశారంటూ మండిపడ్డారు.
వాలంటీర్లకు సంబంధించిన ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా చేశారని పవన్ ఆరోపించారు. అంతటి సీరియస్ అంశంపై కేబినెట్‌లో మంత్రి నారా లోకేశ్‌తో చర్చించే అవకాశం కూడా కనిపించలేదన్నారు. జీతాలు ఎలా చెల్లించారో తెలియక, ప్రజలే వాలంటీర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
వాలంటీర్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలన్న మాయ చేసి ప్రజలను మోసం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యవస్థ ద్వారా రూ. 25 వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తామంటూ తీసుకున్న వాలంటీర్లను పార్టీకోసం పనిచేయించారని విమర్శించారు.
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్ గానీ, జీవో గానీ ఏమీ లేదని వెల్లడించారు. ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఉందని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని అన్నారు. అందువల్లే కేబినెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు అవకాశమే లేదన్నారు.