LIVE
Monday, November 23, 2026
LIVE
LIVE

Narendra Modi | ‘సేవే ధర్మం.. దేశమే తొలి ప్రాధాన్యం’.. మోడీ భావోద్వేగ ప్రసంగం

by Bajaswamy
8 views
PM Narendra Modi

Narendra Modi: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతను స్వీకరించిన రోజు తన రాజకీయ జీవితంలో ఇంత సుదీర్ఘమైన అధ్యాయం మొదలవుతుందని నరేంద్ర మోడీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ 2001 అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఆ ప్రస్థానం.. నేడు 25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణంగా మారింది. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన మోదీ ఇంతకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సేవ కోసం మరింత శక్తిని ప్రసాదించాలని అదే రోజు ఉదయం వినాయకుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు.

‘ప్రజలే భగవంతుడి స్వరూపం’
తనకు దేశం ఎంతో ఇచ్చిందని, అందుకే దేశమే తనకు తొలి ప్రాధాన్యమని మోడీ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తాను ఇప్పటికీ ఒక విద్యార్థిగానే భావిస్తానన్న ప్రధాని చిన్ననాటి వడ్నగర్‌ పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అప్పటి నుంచే తనలో పెరిగిందన్నారు. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే.. దేశానికి సేవ చేసే సామర్థ్యం అంతగా పెరుగుతుందని పేర్కొన్నారు.

సవాళ్లే పాఠాలుగా

25 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలు తనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిందని మోడీ తెలిపారు. గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎదురైన భుజ్‌ భూకంపం కష్టకాలంలో పునర్నిర్మాణానికి పట్టుదల ఎంత అవసరమో నేర్పిందన్నారు. చంద్రయాన్‌ ప్రయోగంలో ఎదురైన వైఫల్యం నుంచి మళ్లీ లేచి ముందుకు సాగడం నేర్చుకున్నానని చెప్పారు. కరోనా సంక్షోభం మాత్రం దేశ సమష్టి చైతన్యం, ఐక్యత ప్రాముఖ్యతను చాటిందన్నారు. తన మద్దతుదారులు ఇచ్చిన ప్రోత్సాహంతో పాటు విమర్శకుల సూచనలు కూడా తనను తాను సమీక్షించుకునేందుకు ఉపయోగపడ్డాయని మోడీ పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మీడియా, రాజకీయ సహచరులు, ఎన్డీయే మిత్రపక్షాలు, బీజేపీ కార్యకర్తలు, తనపై విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

banner

ముందున్న లక్ష్యం.. వికసిత్‌ భారత్‌
25 ఏళ్ల ప్రయాణం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం కాదని మోడీ అన్నారు. భవిష్యత్తు కోసం మరింత బలమైన సంకల్పంతో ముందుకు సాగాల్సిన సమయమని చెప్పారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణంతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలపాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ‘సేవే ధర్మం.. మిషన్‌ కోసం జీవిస్తున్నా’ అన్న మోడీ మాటలు.. ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి తన దృష్టిలో ఉన్న నిర్వచనాన్ని స్పష్టం చేశాయి. 2001లో గుజరాత్‌ సీఎంగా మొదలైన ఈ ప్రయాణం దేశ ప్రధానిగా కొనసాగుతున్న ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇక రాబోయే కాలంలో భారత్‌ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన తదుపరి లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని మోడీ గతాన్ని గుర్తుచేసుకునే సందర్భంగానే కాకుండా భవిష్యత్‌ లక్ష్యాలకు కొత్త సంకల్పంగా మలిచారు. సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, విజయాలను బాధ్యతగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే తన విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణమే తదుపరి లక్ష్యమని చెబుతూ.. “మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More