బెంగుళూరులో జరిగిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) చేసిన ఆధ్యాత్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన ప్రసంగానికి మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపిస్తూ ప్రత్యేకంగా స్పందించారు. యువత రజనీకాంత్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“ఈ ఉదయం మీ స్పీచ్ విన్నాను. అందులోని ప్రతి అంశం నన్ను ఎంతో ఆకట్టుకుంది. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ మీరు స్టార్‌డమ్‌ను ఎంతో హుందాగా, వినయంగా స్వీకరించడం గొప్ప విషయం. యువత మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి” అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
ఇక తన ప్రసంగంలో రజనీకాంత్ మాట్లాడుతూ, హిమాలయాల తర్వాత తనకు అత్యంత నచ్చిన ప్రదేశం ఈ ఆశ్రమమని చెప్పారు. మొదట రెండు రోజుల పాటు మాత్రమే ఉండాలని భావించిన తాను, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా 15 రోజులు గడిపానని వెల్లడించారు. ఒక రోజు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌తో కలిసి వేదికపైకి వెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వేలాది మంది భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ తనను పట్టించుకోకపోవడం తన జీవితంలో గొప్ప అనుభవమని అన్నారు. అందరి దృష్టి గురుదేవులపైనే ఉండటంతో తనలోని గర్వం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.
సెలబ్రిటీ హోదా తాత్కాలికమని, ఆధ్యాత్మికతే జీవితంలో అత్యున్నత స్థానం అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








