మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘మన ఇల్లు-మన లోకేశ్'(Mana Illu- Mana Lokesh) కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఆయన, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో లభించిన 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం సులభమైందని, ప్రజల విశ్వాసమే తనకు బలమని పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తనకు గొప్ప పాఠం నేర్పిందని, అప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేసి వారి నమ్మకాన్ని తిరిగి గెలుచుకున్నానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా 29 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.1,800 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని, వంద పడకల ఆసుపత్రి, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పైప్‌లైన్ గ్యాస్ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని, రూ.4 వేల పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. నిడమర్రు రైల్వే ఓవర్‌బ్రిడ్జిని ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు.









