ఢిల్లీ ఏపీ భవన్‌లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. బియ్యం బస్తాలను పరిశీలించి నాణ్యతను, తూకాన్ని పరిశీలించిన మంత్రి, బస్తాలలో తూకం తేడా రావడాన్ని గమనించారు. దీంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుకాణం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న విషయాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే దానిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పేరుతో నిర్వాహణ అవ్యవస్థగా ఉందని, దీనిని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సరఫరా చేయాలంటే ప్రభుత్వ నియంత్రణ అవసరమని తెలిపారు.
ఇకపై ఆ దుకాణాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒక నెలలోనే ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుందన్నారు. నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. మంత్రి చర్యతో అక్కడి అధికారుల్లో ఉలిక్కిపాటు ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.