ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహకాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వం కోసం మొత్తం తెలంగాణ ఆత్రుతగా ఎదురుచూస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ ఏడాది పాలనతో ప్రజలకు నిజాలు బహిర్గతమయ్యాయని హరీశ్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్‌ను ఉచితం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎత్తిచూపారు.
రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ? రుణమాఫీ, రైతుబంధు అమలులో ఎంత ముందుందీ ప్రభుత్వం? అన్నీ అబద్ధాలేనని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు వేరు, చేతలు వేరు అని అన్నారు. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టగా, రేవంత్ దాన్ని బెంబేలెత్తించారని విమర్శలు గుప్పించారు.
జీఎస్టీ వాటా తగ్గడానికి కూడానూ రేవంత్ పాలనే కారణమని హరీశ్ దుయ్యబట్టారు. ఢిల్లీలో రేవంత్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయన పాలన సగం సగం… ఆగం ఆగం అని చురకలంటించారు. రజతోత్సవ సభతో కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.