Karbonn smartphone comeback: స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో భారతీయ బ్రాండ్ సిద్ధమవుతోంది. గతంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులకు చేరువైన కార్బన్.. మరోసారి మొబైల్ మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. యువతతో పాటు జెన్ జీ, కంటెంట్ క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది.
అందుబాటు ధరలే ప్రధాన లక్ష్యం
కార్బన్ మాతృసంస్థ జైనా గ్రూప్ సీఈఓ ప్రదీప్ జైన్ మాట్లాడుతూ.. ఇటీవలి సంవత్సరాల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు గణనీయంగా పెరగడంతో కొత్త ఫోన్ల కొనుగోలు సామాన్య వినియోగదారులకు భారంగా మారుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అవసరమైన ఫీచర్లతో, అందుబాటు ధరల్లో పరికరాలను అందించడంపై సంస్థ దృష్టి సారించింది. సోషల్ మీడియా వినియోగం, వీడియో షూటింగ్, డిజిటల్ కంటెంట్ తయారీ వంటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఫోన్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే వీటి ధరలు, ఫీచర్లు, విడుదల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
రెబెల్ 5G పేరుతో కొత్త ఫోన్?
కార్బన్ నుంచి రాబోయే ఫోన్ ‘రెబెల్ 5G’ పేరుతో విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన టీజర్ అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఉపయోగకరమైన ఫీచర్లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని కార్బన్ భావిస్తోంది. అయితే ఫోన్ ఫీచర్లు, ధర, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మళ్లీ పుంజుకుంటుందా?
ఒకప్పుడు తక్కువ ధర ఫీచర్ ఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులకు చేరువైన కార్బన్.. మార్కెట్లోకి కొత్త బ్రాండ్లు రావడం, పోటీ తీవ్రం కావడంతో క్రమంగా తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులతో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది. కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, పనితీరు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కంపెనీ అధికారిక వివరాలు ప్రకటించిన తర్వాతే ఈ ఫోన్ల ప్రత్యేకతలు, వినియోగదారులకు ఎంతవరకు ఉపయోగపడతాయో స్పష్టమవుతుంది. అందుబాటు ధరలో ఉపయోగకరమైన ఫీచర్లు అందించగలిగితే, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు కార్బన్ మరో ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది.
ALSO READ: New Zealand | వరుస ఓటములతో సతమతం.. గాయాలతో కివీస్‌కు మరో ఎదురుదెబ్బ!
