Japan Earthquake: జపాన్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ప్రాంతంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం నమోదైంది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే అప్రమత్తమై తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
భూకంపం ప్రభావంతో సముద్రంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, గరిష్టంగా ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే ప్రమాదం ఉందని JMA హెచ్చరించింది. దీంతో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. క్యూషూ ద్వీపంలోని పలు ప్రాంతాలకు ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. కుమామోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మరోవైపు అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ స్పందిస్తూ ఈ భూకంపం కారణంగా హవాయి, అమెరికన్ సమోవా ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని వెల్లడించింది. ప్రస్తుతం ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అయితే భూకంపం తర్వాత వచ్చే అవకాశం ఉన్న ప్రకంపనల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జపాన్ అధికారులు సూచించారు. సహాయక బృందాలు, అత్యవసర విభాగాలు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నాయి.








